🏠 prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 06 November 2026, 4:36 pm Posted by : Praja Nestham Jwala News

త్వరలో ప్రారంభం కానున్న రామస్వామిగుట్ట ఇందిరమ్మ మోడల్ హౌసింగ్ కాలనీ

News Image
2,160 ఇళ్ల నిర్మాణ పనుల పరిశీలన.. మిగిలిన పనులు నాణ్యతతో త్వరగా పూర్తి చేయాలని అధికారులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశం

సూర్యాపేట, నవంబర్‌ 6 (ప్రజానేస్తం జ్వాల): హుజూర్‌నగర్ నియోజకవర్గ కేంద్రంలోని రామస్వామిగుట్ట వద్ద 110 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న 2,160 ఇందిరమ్మ ఇళ్ల మోడల్ హౌసింగ్ కాలనీని త్వరలో ప్రారంభించనున్నట్లు రాష్ట్ర పౌరసరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్ నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.

శుక్రవారం మంత్రి కాలనీని సందర్శించి నిర్మాణ పనులను పరిశీలించారు. విద్యుత్ సౌకర్యం, వీధి దీపాలు, గ్రీనరీ, తాగునీటి వసతి, పైలాన్ స్తూపం, సభాస్థలి తదితర అభివృద్ధి పనులను సమీక్షించారు. మిగిలిన పనులను నాణ్యతా ప్రమాణాలతో త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కాలనీలో నాటిన మొక్కలకు క్రమం తప్పకుండా నీరు అందించి అవి ఎండిపోకుండా సంరక్షించాలని సూచించారు.

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా నిర్వహించాలని మంత్రి స్పష్టం చేశారు. అత్యంత అర్హులైన పేదలకు ప్రాధాన్యతనిస్తూ, ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించాలని, ఎలాంటి అవకతవకలకు తావులేకుండా ఎంపిక ప్రక్రియ చేపట్టాలని అధికారులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో ఎంపీ రఘువీర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, ఎస్పీ కే. నరసింహ, ఆర్డీవో శ్రీనివాసులు, హౌసింగ్ పీడీ జబ్బార్, వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, గుత్తేదారులు తదితరులు పాల్గొన్నారు.
🏠 Home