*ఎన్నికల పెండింగ్ బిల్లులు వెంటనే మంజూరు చేయాలి*
హైదరాబాద్, నవంబర్ 5 (ప్రజానేస్తం జ్వాల):
రాష్ట్రంలో వివిధ ఎన్నికల నిర్వహణకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిప్యూటీ కలెక్టర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి. లచ్చిరెడ్డి కోరారు. తెలంగాణ శాసనసభ సాధారణ ఎన్నికలు–2023, లోక్‌సభ ఎన్నికలు–2024 సందర్భంగా రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులు చేసిన అదనపు ఖర్చులకు సంబంధించిన బకాయిలను చెల్లించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ మేరకు గురువారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డిని డిప్యూటీ కలెక్టర్ల సంఘం ప్రతినిధులు కలిసి వినతిపత్రం అందజేశారు. ఎన్నికల నిర్వహణకు కేటాయించిన బడ్జెట్ సరిపోకపోవడంతో పలు అసెంబ్లీ, పార్లమెంటరీ నియోజకవర్గాల్లో అదనపు ఖర్చులు చేయాల్సి వచ్చిందని లచ్చిరెడ్డి తెలిపారు. ఈ వ్యయాలను అప్పుల రూపంలో సమకూర్చుకోవాల్సి వచ్చిందని, వాటికి సంబంధించిన బిల్లులు ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు.
బకాయిల చెల్లింపులు ఆలస్యం కావడంతో కొందరు రుణదాతలు కోర్టులను ఆశ్రయించగా, మరికొందరు అప్పటి రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారుల కార్యాలయాలు, నివాసాలకు వెళ్లి డబ్బుల కోసం ఒత్తిడి చేస్తున్నారని పేర్కొన్నారు. దీంతో అధికారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అదనపు బడ్జెట్ మంజూరు కోసం సంబంధిత అధికారులు ఇప్పటికే ప్రతిపాదనలు సమర్పించినప్పటికీ, అవి వివిధ స్థాయిల్లో పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం, మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గాలకు సంబంధించిన అదనపు నిధుల ప్రతిపాదనలను కూడా సీఈఓ దృష్టికి తీసుకెళ్లారు.
ఎన్నికల నిర్వహణలో చేసిన అదనపు ఖర్చులకు సంబంధించి రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులు సమర్పించిన ప్రతిపాదనలను తక్షణమే పరిశీలించి, పెండింగ్ బిల్లులతోపాటు అదనపు బడ్జెట్‌ను మంజూరు చేయాలని లచ్చిరెడ్డి కోరారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ల సంఘం నాయకులు శకుంతల, లావణ్య, టీజీటీఏ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్. రాములు, ప్రధాన కార్యదర్శి రమేష్ పాక, మహిళా అధ్యక్షురాలు రాధ, శ్రీకాంత్, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.