**దూరదర్శన్ సప్తగిరి ‘మన ఊరు – మన పాట’లో కోట వీరస్వామికి ప్రథమ బహుమతి**
**కళారంగంలో అరుదైన గుర్తింపు.. గ్రామానికి గర్వకారణంగా నిలిచిన కళాకారుడు**
గరిడేపల్లి, నవంబర్ 5 (ప్రజానేస్తం జ్వాల):
దూరదర్శన్ సప్తగిరి ఛానల్ నిర్వహించిన ‘మన ఊరు – మన పాట’ సీజన్-2 పోటీల్లో సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం తాళ్లమలకాపురం గ్రామానికి చెందిన కళాకారుడు కోట వీరస్వామి ప్రథమ బహుమతి సాధించారు. తన ప్రతిభతో గ్రామానికి, మండలానికి, జిల్లాకు గుర్తింపు తీసుకొచ్చారు.
ఈ సందర్భంగా పలువురు కళాకారులు, గ్రామస్తులు, అభిమానులు కోట వీరస్వామికి అభినందనలు తెలిపారు. తన విజయంపై ఆయన మాట్లాడుతూ.. చిన్ననాటి నుంచే కళలపై ఆసక్తి ఉండేదని, కళారంగాన్నే జీవితంగా భావించి ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొంటూ ముందుకు సాగానని తెలిపారు.
కళాకారుడిగా గుర్తింపు పొందేందుకు అనేక అవరోధాలను అధిగమించానని, తన ప్రతిభను నిరూపించుకోవడానికి నిరంతరం కృషి చేశానని పేర్కొన్నారు. కళాకారుల ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తే మరింత మంది కళారంగంలోకి వస్తారని అభిప్రాయపడ్డారు.
‘మన ఊరు – మన పాట’ కార్యక్రమంలో ప్రథమ బహుమతి సాధించడం తన జీవితంలో మరిచిపోలేని మైలురాయిగా నిలిచిపోతుందని అన్నారు. తన విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులోనూ కళారంగంలో మరిన్ని విజయాలు సాధించి గ్రామానికి మంచి పేరు తీసుకురావడమే తన లక్ష్యమని చెప్పారు.
ఈ సందర్భంగా తనకు గురువులతో సమానమైన సీనియర్ కళాకారులు మర్యాద సైదులు, జోగునూరి సుందర్రావు, విరన్న, దాసరి శ్రీనివాస్, దారం మల్లేష్ యాదవ్, నందిపాటి సైదులు, అనంత రాములు, తురక విరయ్య, రామ్మూర్తి తదితరులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.