ఆగి ఉన్న ట్రాక్టర్లను ఢీకొన్న కారు
భీమదేవరపల్లి, నవంబర్ 5 (ప్రజానేస్తం జ్వాల):
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం గట్లనర్సింగాపూర్ స్టేజ్ సమీపంలో గురువారం సాయంత్రం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుపక్కన గడ్డి కట్టలతో నిలిపి ఉంచిన ట్రాక్టర్లను వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
స్థానికుల వివరాల ప్రకారం.. ఎల్కతుర్తి–సిద్దిపేట జాతీయ రహదారిపై గట్లనర్సింగాపూర్ స్టేజ్ సమీపంలో గడ్డి కట్టలతో కూడిన ట్రాక్టర్లు రోడ్డుపక్కన నిలిపి ఉన్నాయి. అదే సమయంలో హుస్నాబాద్ వైపు నుంచి వస్తున్న కారు అదుపుతప్పి ట్రాక్టర్లను ఢీకొట్టింది. ప్రమాదంలో కారు దెబ్బతిన్నప్పటికీ ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదు.
రహదారి భద్రతపై ఆందోళన
ఈ జాతీయ రహదారిపై ప్రమాదకర మలుపుల వద్ద హెచ్చరిక బోర్డులు, వేగ పరిమితి సూచికలు ఏర్పాటు చేయకపోవడంపై వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మార్గంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రయాణికుల భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
సంబంధిత అధికారులు స్పందించి ప్రమాదకర ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు, వేగ నియంత్రణ సూచికలు ఏర్పాటు చేయడంతోపాటు రోడ్డుపక్కన వాహనాల పార్కింగ్‌ను నియంత్రించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.