సీపీఐ సీనియర్ నాయకుడు కామ్రేడ్ పెసర నారాయణ మృతి
పార్టీ అభివృద్ధికి ఆయన చేసిన సేవలు మరువలేనివి: సీపీఐ నాయకులు
ధర్మసాగర్, నవంబర్ 5 (ప్రజానేస్తం జ్వాల):
హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం తాటికాయల గ్రామానికి చెందిన సీపీఐ గ్రామ శాఖ కార్యవర్గ సభ్యుడు, సీనియర్ నాయకుడు కామ్రేడ్ పెసర నారాయణ గురువారం తెల్లవారుజామున 4 గంటలకు మృతి చెందారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటని సీపీఐ నాయకులు పేర్కొన్నారు.
నారాయణ మృతి విషయం తెలుసుకున్న ధర్మసాగర్ మండల సీపీఐ కోశాధికారి, డీహెచ్‌పీఎస్ జిల్లా అధ్యక్షుడు రాజారపు రత్నం, మండల సీనియర్ నాయకుడు డోకి రాజన్న తదితరులు గ్రామానికి చేరుకుని ఆయన పార్థివదేహంపై పార్టీ కండువా కప్పి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. నారాయణ జీవితాంతం సీపీఐ సిద్ధాంతాలకు కట్టుబడి, పార్టీ అభివృద్ధికి అంకితభావంతో పనిచేశారని కొనియాడారు. ఆయన చేసిన సేవలు మరువలేనివని, ఆశయాలను కొనసాగించడమే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.
నారాయణకు కుమారుడు యాదగిరితో పాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ కార్యక్రమంలో నేరెళ్ల రాజయ్య, రాజారపు శీను, పిట్టల వీరయ్య, నీల ఎల్లయ్య, సాంబరాజు, కొమురయ్య, కొండబోయిన పాపయ్య, పెసర లక్ష్మయ్య తదితరులు పాల్గొని నివాళులర్పించారు.