తాగునీటి ఎద్దడికి ముందస్తు కట్టడి.. గ్రామాల వారీగా కార్యాచరణ!
వాటర్ స్ట్రెస్ గ్రామాలను నవంబర్లోనే గుర్తించాలి.. వారం రోజుల్లో యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలి
హాస్టళ్లు, గురుకుల పాఠశాలలకు 15 రోజుల్లో మిషన్ భగీరథ కనెక్షన్లు: కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
సూర్యాపేట, నవంబర్ 5 (ప్రజానేస్తం జ్వాల):
వేసవిలో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటి నుంచే పకడ్బందీ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. నీటి ఎద్దడి ఎదుర్కొనే గ్రామాలను నవంబర్లోనే గుర్తించి సమస్యల పరిష్కారానికి కార్యాచరణ రూపొందించాలని, వారం రోజుల్లో గ్రామాల వారీగా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని స్పష్టం చేశారు.
గురువారం సమీకృత కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామాలు, ఆవాసాల్లో తాగునీటి పరిస్థితులను అంచనా వేసి గ్రీన్, ఎల్లో, రెడ్ కేటగిరీలుగా విభజించాలన్నారు. మిషన్ భగీరథ గ్రిడ్, ఇంట్రా వ్యవస్థలు, స్థానిక నీటి వనరుల పరిస్థితిని పరిశీలించి నీటి సమస్యల తీవ్రతను గుర్తించాలని సూచించారు. అవసరమైన పనులు, అంచనా వ్యయాలతో కూడిన నివేదికను వారం రోజుల్లో సమర్పించాలని ఆదేశించారు.
హాస్టళ్లకు 15 రోజుల్లో నీటి కనెక్షన్లు
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలలకు 15 రోజుల్లో మిషన్ భగీరథ కనెక్షన్లు అందించాలని కలెక్టర్ ఆదేశించారు. కనెక్షన్లు లేని చోట ప్రత్యామ్నాయంగా నీటి సరఫరా కల్పించాలని, అవసరమైతే సంపులు, సింటెక్స్ ట్యాంకులు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు నిరంతర తాగునీటి సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.
25 శాతం నీటి వృథాపై ఆరా
మిషన్ భగీరథ ద్వారా సరఫరా అవుతున్న నీటిలో సుమారు 20 నుంచి 25 శాతం వరకు వృథా అవుతున్నట్లు ప్రాథమికంగా గుర్తించామని కలెక్టర్ తెలిపారు. పైపులైన్ల లీకేజీలు, ఓవర్‌హెడ్ ట్యాంకుల నుంచి వృథాగా డ్రైనేజీల్లోకి వెళ్తున్న నీటిని గుర్తించి అరికట్టాలని ఆదేశించారు. క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం వాస్తవ పరిస్థితిపై వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలన్నారు.
ప్రతి గ్రామంలో ట్యాంకర్ అందుబాటులో ఉండాలి
అత్యవసర పరిస్థితుల్లో నీటి సరఫరాకు ప్రతి గ్రామపంచాయతీలో ట్రాక్టర్, ట్యాంకర్ సిద్ధంగా ఉంచాలని సూచించారు. పనిచేయని వాహనాలకు వెంటనే మరమ్మతులు చేయించి, అవసరమైన గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేసేలా ముందస్తు ప్రణాళిక రూపొందించాలన్నారు.
భూగర్భ జలాలపై నిరంతర పర్యవేక్షణ
భూగర్భ జలాల లభ్యత, బోర్ల పరిస్థితిపై ప్రతి 15 రోజులకు ఒకసారి నివేదిక సమర్పించాలని గ్రౌండ్ వాటర్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ భవనాలు, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో రూఫ్‌టాప్ రెయిన్వాటర్ హార్వెస్టింగ్, బోర్వెల్ రీచార్జ్ నిర్మాణాలు, కమ్యూనిటీ సోక్పిట్లు ఏర్పాటు చేయాలని సూచించారు.
మిషన్ భగీరథ, విద్యుత్, ఇరిగేషన్, పంచాయతీరాజ్, గ్రౌండ్ వాటర్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని, ప్రతి వారం తాగునీటి సరఫరాపై సమీక్ష నిర్వహించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ బి. హరి సింగ్, డీఆర్డీఓ సన్యాసయ, జడ్పీ సీఈఓ శిరీష, డీపీఓ యాదగిరి, మిషన్ భగీరథ ఈఈ అరుణాకర్ రెడ్డి, డీడబ్ల్యూఓ నరసింహారావు తదితర అధికారులు పాల్గొన్నారు.