డిసెంబర్ 15 నుంచి ఆశా వర్కర్ల నిరవధిక సమ్మె
రూ.18 వేల ఫిక్స్‌డ్ వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్
భీమదేవరపల్లి, నవంబర్ 5 (ప్రజానేస్తం జ్వాల):
ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మె చేపట్టనున్నట్లు యూనియన్ నాయకులు ప్రకటించారు. ముల్కనూర్, వంగర పీహెచ్‌సీల పరిధిలోని 55 మంది ఆశా కార్యకర్తలు ఈ సమ్మెలో పాల్గొననున్నారు.
ఈ మేరకు హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర పీహెచ్‌సీలో యూనియన్ నాయకులు టి.శోభ, పుథిలి ఆధ్వర్యంలో వైద్యాధికారి డాక్టర్ రెహమాన్‌కు సమ్మె నోటీసులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 28 వేల మంది ఆశా వర్కర్లు గత 20 ఏళ్లుగా ప్రజారోగ్య సేవల్లో కీలకంగా పనిచేస్తున్నప్పటికీ, నెలకు కేవలం రూ.9,900 పారితోషికం మాత్రమే అందుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆశా వర్కర్లకు నెలకు రూ.18 వేల ఫిక్స్‌డ్ వేతనం, ఉద్యోగ భద్రత, పీఎఫ్, ఈఎస్ఐ, బీమా, ప్రసూతి భృతి, రిటైర్మెంట్ ప్రయోజనాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే సెలవులు, ప్రమోషన్లు, డీఏలు అమలు చేయాలని కోరారు.
డిమాండ్ల సాధన కోసం నవంబర్ 10న ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు, 16న కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు, 20న మంత్రులకు వినతిపత్రాలు సమర్పించనున్నట్లు తెలిపారు. డిసెంబర్ 5 నుంచి గ్రామస్థాయిలో ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు అందజేసి ఉద్యమాన్ని ఉధృతం చేయనున్నట్లు వెల్లడించారు.
ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించకపోతే డిసెంబర్ 15 నుంచి సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో యూనియన్ నాయకులు కల్పన, పద్మ, సునీత, రాణి, రాజమణి తదితరులు పాల్గొన్నారు.