మధ్యాహ్న భోజన వంట నిర్వహణపై వివాదం.. మహిళల నిరసన
ధర్మసాగర్, నవంబర్ 5 (ప్రజానేస్తం జ్వాల): ధర్మసాగర్ మండలం నారాయణగిరి ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం వంట నిర్వహణపై వివాదం నెలకొంది. గత కొన్నేళ్లుగా విద్యార్థులకు భోజనం వండిపెడుతున్న తమను పక్కనపెట్టి, ప్రస్తుతం కేవలం ఆరుగురు మహిళలతోనే వంట చేయిస్తున్నారని పలువురు మహిళలు ఆరోపించారు. ఈ నిర్ణయాన్ని నిరసిస్తూ పాఠశాల వద్ద ఆందోళన వ్యక్తం చేశారు.
మధ్యాహ్న భోజన పథకం ప్రారంభమైనప్పటి నుంచి మహిళా సంఘం సభ్యులుగా తాము విద్యార్థులకు భోజనం వండిపెడుతూ బాధ్యతలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అలాంటిది తమకు అవకాశం కల్పించకుండా అడ్డుకోవడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వివాదం గ్రామంలో మహిళల మధ్య విభేదాలకు, ఘర్షణలకు దారితీసే పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు.
సంబంధిత అధికారులు వెంటనే జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని, గతంలో మాదిరిగానే తమకు కూడా వంట చేసే అవకాశం కల్పించి అందరికీ న్యాయం చేయాలని కోరారు. లేనిపక్షంలో పాఠశాల ప్రాంగణంలో నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.