🏠 prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 04 November 2026, 6:43 pm Posted by : Praja Nestham Jwala News

డ్రోన్లు, రోబోటిక్ టెక్నాలజీ, వ్యవసాయ యంత్రాల వినియోగంపై వివరించిన విద్యార్థినులు

News Image

కీతవారిగూడెం, నవంబర్‌ 4 (ప్రజానేస్తం జ్వాల):
సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం కీతవారిగూడెం గ్రామంలో గడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో రైతులకు ఆధునిక వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఏలూరులోని సీహెచ్‌ఎస్‌డీ సెయింట్ థెరిస్సా మహిళా కళాశాలకు చెందిన బీఎస్సీ అగ్రికల్చర్ విద్యార్థినులు గ్రామీణ వ్యవసాయ అనుభవ కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం, పంటలకు పురుగుమందులు, ఎరువుల పిచికారీలో వాటి ఉపయోగాలు, రోబోటిక్ సాంకేతికత ద్వారా వ్యవసాయ పనులను వేగంగా పూర్తి చేసే విధానాలను రైతులకు వివరించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో కూలీల ఖర్చులు, సమయం, శ్రమ తగ్గడంతో పాటు వ్యవసాయ పెట్టుబడి వ్యయాన్ని నియంత్రించి దిగుబడి, ఆదాయం పెంచుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.
అలాగే ట్రాక్టర్, వరి నాటే యంత్రం, మిశ్రమ పంటకోత యంత్రం, పవర్ వీడర్, రోటావేటర్ వంటి ఆధునిక వ్యవసాయ పరికరాల పనితీరు, ప్రయోజనాలను వివరించారు. వీటి ద్వారా దుక్కి దున్నడం, వరి నాట్లు వేయడం, కలుపు తొలగించడం, పంట కోత వంటి పనులను తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో పూర్తి చేసుకోవచ్చని అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ బీఎస్సీ విద్యార్థినులు ఎం. నవ్యశ్రీ, ఐ. సత్యజ్యోతి, పి. హేమలత, వై. సౌమ్య, వై. మనీషా పాల్గొని రైతులకు వివరించారు. రైతులు నర్సింగ్, సతీష్, వేల్పుల సైదులు, ఎస్.కె. నాగులు, మీరా, గుడేపు అశోక్, దొంతగాని అంజయ్య, గుడేపు లక్ష్మీనారాయణ, ఎన్. నరసింహారావు, గుండూరి రాఘవయ్య, దాసరి సైదులు, బడేటి వినయ్ తదితరులు పాల్గొన్నారు.
🏠 Home