🏠 prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 04 November 2026, 6:42 pm Posted by : Praja Nestham Jwala News

గోదాంలలో బియ్యం నిల్వలు, నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టాలి

News Image

ఆరు బఫర్ గోదాంల హమాలీలకు లేబర్ కార్డులు అందేలా చర్యలు
సూర్యాపేట, నవంబర్‌ 04 (ప్రజానేస్తం జ్వాల):
గోదాంలలో బియ్యం నిల్వలు, నాణ్యత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం చేయొద్దని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. బుధవారం కోదాడ సమీపంలోని బాలాజీనగర్ ఎస్‌డబ్ల్యూసీ గోదాంను కలెక్టర్, జిల్లా ఎస్పీ కె. నరసింహతో కలిసి సందర్శించి తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా గోదాంలోని బియ్యం నిల్వలు, నిర్వహణ తీరును పరిశీలించారు. స్టాక్ రికార్డులను తనిఖీ చేయడంతో పాటు బియ్యం నమూనాలను సేకరించి నాణ్యత పరీక్షలు చేయించారు. పరీక్ష ఫలితాలు సంతృప్తికరంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
పేదలకు పంపిణీ చేసే సన్న బియ్యాన్ని జాగ్రత్తగా నిల్వ చేయాలని కలెక్టర్ సూచించారు. బియ్యం నాణ్యత విషయంలో రాజీ పడకూడదని గోదాం మేనేజర్, టెక్నికల్ అసిస్టెంట్లకు స్పష్టం చేశారు. నిల్వ విధానం, భద్రతా ప్రమాణాలు, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ (ఎఫ్‌ఐఎఫ్ఓ) పద్ధతిని తప్పనిసరిగా పాటించాలని, రికార్డులను ఎప్పటికప్పుడు సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు.
హమాలీలకు లేబర్ కార్డులు
అనంతరం గోదాంలో పనిచేస్తున్న హమాలీలతో కలెక్టర్ మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. లేబర్ కార్డులు మంజూరు చేయించాలని హమాలీలు కోరగా, స్పందించిన కలెక్టర్ సంబంధిత లేబర్ అధికారితో మాట్లాడారు. జిల్లాలోని ఆరు బఫర్ గోదాంలలో పనిచేస్తున్న హమాలీలందరికీ లేబర్ కార్డులు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వారి ఇతర సమస్యలను కూడా పరిశీలించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సూర్యనారాయణ, జిల్లా సివిల్ సప్లైస్ మేనేజర్ శ్రీధర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రమాదేవి, తహసీల్దార్ సంతోష్ కిరణ్, ఎస్‌డబ్ల్యూసీ మేనేజర్ సందీప్, టెక్నికల్ అసిస్టెంట్లు భాస్కర్ రెడ్డి, అరుణ తదితరులు పాల్గొన్నారు.
🏠 Home