కుమురం భీం ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
ఆసిఫాబాద్, నవంబర్ 3 (ప్రజానేస్తం జ్వాల):
జల్, జంగల్, జమీన్ నినాదంతో ఆదివాసీల హక్కులు, ఆత్మగౌరవం కోసం పోరాడిన కుమురం భీం ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క పిలుపునిచ్చారు. జిల్లా రాజ్ గోండ్ సేవా సమితి ఆధ్వర్యంలో ఆసిఫాబాద్‌లో నిర్వహించిన కుమురం భీం స్మారక జెండా ఆవిష్కరణ, వర్ధంతి వారోత్సవాల్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని జెండాను ఆవిష్కరించారు. అనంతరం కుమురం భీం విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆదివాసీల హక్కుల పరిరక్షణ, సంక్షేమం, అభివృద్ధికి కృషి చేయడమే కుమురం భీంకు నిజమైన నివాళి అని పేర్కొన్నారు. ఆయన పోరాట స్ఫూర్తి భావితరాలకు ఆదర్శమని అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, పలువురు సర్పంచులు, ప్రజాప్రతినిధులు, జిల్లా రాజ్ గోండ్ సేవా సమితి నాయకులు, ఆదివాసీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.