జర్నలిస్టుల సంక్షేమానికి పోరాట కార్యాచరణ
హైదరాబాద్, నవంబర్ 4 (ప్రజానేస్తం జ్వాల): జర్నలిస్టుల సంక్షేమానికి సంబంధించిన ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డుల సమస్యల పరిష్కారం కోసం పోరాట కార్యాచరణ రూపొందించాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్ణయించింది.
బుధవారం హైదరాబాద్ బీహెచ్‌ఈఎల్‌లోని హోటల్ శుభంలో రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ అధ్యక్షతన ఆరు గంటల పాటు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస రెడ్డి, కార్యదర్శి రామనారాయణ, యూనియన్ జాతీయ నాయకుడు కుంజేటి సత్యనారాయణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చలసాని శ్రీనివాసరావు, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కోలా నాగేశ్వరరావు, బంటు కృష్ణ తదితరులు హాజరయ్యారు.
సమావేశంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డుల మంజూరుపై విస్తృతంగా చర్చించారు. ఈ సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్ కార్యాచరణతో ఉద్యమాలు చేపట్టాలని నిర్ణయించారు. అక్రిడిటేషన్ కార్డుల మంజూరు ప్రక్రియపై సమావేశం సంతృప్తి వ్యక్తం చేసింది. కార్యదర్శి సమర్పించిన నివేదికను ఏకగ్రీవంగా ఆమోదించి హర్షం వ్యక్తం చేశారు.