🏠 prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 02 November 2026, 11:48 am Posted by : Praja Nestham Jwala News

మురాసు తుఫాన్‌ పట్ల అప్రమత్తంగా ఉండాలి

News Image

గరిడేపల్లి మండల ప్రజలకు తహసీల్దార్‌ సూచనలు.. నేడు సాయంత్రం 4 గంటలలోపు ఇళ్లకు చేరుకోవాలి

గరిడేపల్లి, ప్రజానేస్తం జ్వాల న్యూస్: మురాసు తుఫాన్‌ నేపథ్యంలో గరిడేపల్లి మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్‌ సూచించారు. జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు ప్రజలకు పలు జాగ్రత్తలు సూచిస్తూ ప్రకటన విడుదల చేశారు. తుఫాన్‌ తీవ్రత నేడు సాయంత్రం 4 గంటల నుంచి రేపు సాయంత్రం వరకు అధికంగా ఉండే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

తుఫాన్‌ ప్రభావం దృష్ట్యా ప్రజలు సాధ్యమైనంత వరకు ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని, పాడుబడిన ఇళ్లు, శిథిలావస్థలో ఉన్న గోడలు, విద్యుత్‌ స్తంభాల సమీపానికి వెళ్లవద్దని సూచించారు. బలమైన గాలుల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున ఇళ్ల తలుపులు, కిటికీలు బిగించి, గాలులకు ఎగిరిపోయే వస్తువులను సురక్షితంగా ఉంచుకోవాలన్నారు.

పిల్లలు, పెద్దలు చెరువులు, కాలువలు, ఇతర నీటి ప్రాంతాల వద్దకు వెళ్లవద్దని హెచ్చరించారు. కోత పూర్తయిన వరి ధాన్యాన్ని టార్పాలిన్లతో కప్పి వర్షం నుంచి రక్షించుకోవాలని రైతులకు సూచించారు. పశువుల మేతకు, ఇతర పనుల నిమిత్తం బయటకు వెళ్లిన వారు సాయంత్రం 4 గంటలలోపు ఇళ్లకు చేరుకోవాలని కోరారు.

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, ప్రమాదాలు చోటుచేసుకున్నా వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని తహసీల్దార్‌ తెలిపారు. తుఫాన్‌ సమయంలో ప్రజలు నిర్లక్ష్యం చేయకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
🏠 Home