ఎమ్మెల్సీ ఓటర్ల నమోదుపై బీజేపీ సమీక్ష
అర్హులందరినీ ఓటర్లుగా నమోదు చేయాలి: సంకినేని
సూర్యాపేట, అక్టోబర్ 31 (ప్రజానేస్తం జ్వాల):
రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో సూర్యాపేట నియోజకవర్గంలో ఓటర్ల నమోదును విస్తృతంగా చేపట్టాలని బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావు కోరారు. శనివారం బీజేపీ నియోజకవర్గ కార్యాలయంలో నిర్వహించిన పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అర్హులైన ప్రతి ఒక్కరినీ ఎమ్మెల్సీ ఓటర్లుగా నమోదు చేయించాలని, నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు ప్రజాదరణ కోల్పోతున్నాయని సంకినేని విమర్శించారు. తెలంగాణలో బీజేపీకి ఆదరణ పెరుగుతోందని ఆయన పేర్కొన్నారు.
అంతకుముందు సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి చలమల నరసింహ, ఇతర పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.