నల్లగొండ కిసాన్ సభ మహాసభలను జయప్రదం చేయాలి
సూర్యాపేట, అక్టోబర్ 31 (ప్రజానేస్తం జ్వాల): నవంబర్ 15 నుంచి 18 వరకు నల్లగొండలో నిర్వహించనున్న అఖిలభారత కిసాన్ సభ 36వ మహాసభలను విజయవంతం చేయాలని ఆ సంఘం కేంద్ర కమిటీ సభ్యులు జూలకంటి రంగారెడ్డి పిలుపునిచ్చారు. శనివారం సూర్యాపేటలో జరిగిన తెలంగాణ రైతు సంఘం జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు.
నవంబర్ 15న ఎన్జీ కళాశాల మైదానంలో రైతులతో భారీ ప్రదర్శన, బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. నవంబర్ 14న జరిగే రైతు ఎగ్జిబిషన్‌లో వ్యవసాయ రంగ చరిత్ర, రైతాంగ ఉద్యమాలు, ప్రస్తుత వ్యవసాయ పరిస్థితులకు సంబంధించిన అంశాలను ప్రదర్శించనున్నట్లు పేర్కొన్నారు. మహాసభలకు దేశవ్యాప్తంగా 850 మందికి పైగా ప్రతినిధులు, పరిశీలకులు హాజరవుతారని వెల్లడించారు.
రైతులు ఎదుర్కొంటున్న పెట్టుబడి ఖర్చులు, గిట్టుబాటు ధరలు, అప్పుల భారం వంటి సమస్యలపై మహాసభల్లో చర్చించనున్నట్లు రంగారెడ్డి తెలిపారు. రైతులు, కౌలురైతులు, వ్యవసాయ కార్మికుల సమస్యల పరిష్కారానికి సమగ్ర చర్యలు అవసరమని పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా నుంచి రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని మహాసభలను విజయవంతం చేయాలని కోరారు.
తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మల్లు నాగార్జున్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు, కందాల శంకర్ రెడ్డి, కోట గోపి, బెల్లంకొండ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.