దేశ ఐక్యత, సమగ్రతకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
సూర్యాపేట, అక్టోబర్ 31 (ప్రజానేస్తం జ్వాల): దేశ సమైక్యత, సమగ్రతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ పిలుపునిచ్చారు. సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతి సందర్భంగా శనివారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జాతీయ ఐక్యత దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వాతంత్ర్య ఉద్యమంలో పటేల్ కీలక పాత్ర పోషించారని, స్వాతంత్ర్యం అనంతరం సంస్థానాల విలీనంలో ఆయన చేసిన కృషి మరువలేనిదని పేర్కొన్నారు. హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమయ్యేలా ఆయన చేసిన కృషిని గుర్తుచేశారు. దేశ ఐక్యత, సమగ్రత పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.
అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న వారితో కలెక్టర్ జాతీయ ఐక్యత ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ప్రేమ్‌రాజ్, జడ్పీ సీఈవో శిరీష, డీఎస్ఓ మోహన్‌బాబు, ఆర్డీవోలు శ్రీనివాసులు, సూర్యనారాయణ, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.