జాఫర్‌గఢ్ గురుకులంలో రూ.42 లక్షల ఆర్థిక అక్రమాల ఆరోపణలు.. ప్రిన్సిపాల్ సంతకం ఫోర్జరీ చేసినట్లు ఫిర్యాదు!
జనగామ, అక్టోబర్ 30 (ప్రజానేస్తం జ్వాల): జనగామ జిల్లాలోని జాఫర్‌గఢ్ గురుకులంలో సుమారు రూ.42 లక్షల ఆర్థిక అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. గురుకుల మహిళా ప్రిన్సిపాల్ సంతకాన్ని ఫోర్జరీ చేసి నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు జూనియర్ అసిస్టెంట్‌పై ఆరోపణలు రావడం కలకలం రేపుతోంది.
గురుకులానికి సరుకులు, సేవలు అందించిన వెండర్లకు చెల్లించాల్సిన 35 చెక్కులను వారి పేర్లకు బదులుగా తన స్నేహితుల పేర్లపైకి మార్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ చెక్కుల ద్వారా సుమారు రూ.42 లక్షల మేర నిధులు దుర్వినియోగమైనట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఈ వ్యవహారాన్ని గుర్తించిన మహిళా ప్రిన్సిపాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. చెక్కుల లావాదేవీలు, బ్యాంకు ఖాతాలకు జరిగిన నగదు బదిలీల వివరాలను పరిశీలిస్తున్నారు.
ప్రభుత్వ విద్యాసంస్థలో ఇంత భారీ మొత్తంలో ఆర్థిక అవకతవకల ఆరోపణలు వెలుగులోకి రావడం చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంలో పూర్తి వాస్తవాలు, నిధుల వినియోగం, ఇతరుల ప్రమేయం వంటి అంశాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.