మాదకద్రవ్యాల మత్తుకు దూరంగా ఉండండి.. ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోండి!
భీమదేవరపల్లి, అక్టోబర్ 30 (ప్రజానేస్తం జ్వాల) : యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ ఉజ్వల భవిష్యత్తు కోసం కృషి చేయాలని కాజీపేట ఎక్సైజ్ ఎస్‌ఐలు సాయిరాం, సురేష్ రెడ్డి సూచించారు.
మండలంలోని ముల్కనూర్ ఏకేవీఆర్ జూనియర్, డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐలు మాట్లాడుతూ మాదకద్రవ్యాల వినియోగం ఆరోగ్యంతో పాటు కుటుంబ, సామాజిక జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతుందని వివరించారు. విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండి చదువుపై దృష్టి సారించాలని కళాశాల ప్రిన్సిపల్ బి. శ్రీకాంత్ సూచించారు. కార్యక్రమంలో అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.