🏠 prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 30 October 2026, 5:41 am Posted by : Praja Nestham Jwala News

హుజూర్‌నగర్‌లో ‘చల్తా హై’ ట్రాఫిక్‌నా..?

News Image

పొట్టి శ్రీరాములు సెంటర్‌లో ఫుట్‌పాత్‌ ఆక్రమణలు.. రోడ్డుపైనే వ్యాపారాలు!

రెండు ప్రమాదాలు జరిగినా మారని పరిస్థితి.. ట్రాఫిక్‌ నియంత్రణపై అధికారుల నిర్లక్ష్యమా?

హుజూర్‌నగర్, అక్టోబర్ 29 (ప్రజానేస్తం జ్వాల):

అంతా మా ఇష్టం.. మమ్మల్ని అడిగేదెవరు? అన్నట్లుగా హుజూర్‌నగర్ పట్టణంలోని పొట్టి శ్రీరాములు సెంటర్‌లో ట్రాఫిక్‌ పరిస్థితి తయారైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. నిత్యం వాహనాలు, ప్రయాణికులతో రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో ఫుట్‌పాత్‌లపై ఆక్రమణలు, రోడ్డుపై వ్యాపారాల నిర్వహణతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జనం రద్దీ.. వాహనాల రాకపోకలకు ఇబ్బందులు

పొట్టి శ్రీరాములు సెంటర్‌ పరిసరాల్లో బస్టాండ్‌, ఆటో స్టాండ్‌, ద్విచక్ర వాహనాల రాకపోకలతో పాటు పోస్టాఫీసు, గ్రంథాలయం ఉండటంతో రోజూ పెద్ద సంఖ్యలో ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. ఇలాంటి రద్దీ ప్రాంతంలో ఫుట్‌పాత్‌లను ఆక్రమించి, నేరుగా రోడ్డుపైనే వ్యాపారాలు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో పాదచారులు రోడ్డుపైకి రావాల్సి వస్తోందని, వాహనాల రాకపోకలకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.

రెండు ప్రమాదాలు జరిగినా చర్యలేవీ?

ఈ ప్రాంతంలో రెండు ప్రమాదాలు జరిగినప్పటికీ పరిస్థితిలో మార్పు కనిపించడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ప్రమాదాలు జరిగిన తర్వాతైనా అధికారులు స్పందించి ట్రాఫిక్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాల్సి ఉందని అభిప్రాయపడుతున్నారు. రద్దీగా ఉండే ప్రాంతంలో ఆక్రమణలను తొలగించి, పాదచారులకు సురక్షితమైన మార్గం కల్పించడంతో పాటు వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించాలని కోరుతున్నారు.

గతంలో ఒక హారన్‌తోనే ట్రాఫిక్‌ నియంత్రణ.. ఇప్పుడు?

గతంలో ట్రాఫిక్‌ పోలీసులు రంగంలోకి దిగితే ఒక హారన్‌తోనే రద్దీని నియంత్రించే పరిస్థితి ఉండేదని స్థానికులు గుర్తుచేస్తున్నారు. ప్రస్తుతం మాత్రం ట్రాఫిక్‌ సమస్యలు పెరుగుతున్నా నియంత్రణ చర్యలు కనిపించడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో మాదిరిగా ట్రాఫిక్‌ నియంత్రణలో క్రమశిక్షణ ఎందుకు కనిపించడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

అధికారులు స్పందించేది ఎప్పుడు?

పొట్టి శ్రీరాములు సెంటర్‌లో ఫుట్‌పాత్‌ ఆక్రమణలపై చర్యలు తీసుకోవడంతో పాటు రోడ్డుపై వ్యాపారాల నిర్వహణను నియంత్రించాలని ప్రజలు కోరుతున్నారు. ట్రాఫిక్‌ పోలీసులు, మున్సిపల్‌ అధికారులు సమన్వయంతో తనిఖీలు నిర్వహించి సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.ప్రజల భద్రతకు, రద్దీ ప్రాంతంలో సజావుగా రాకపోకలు సాగించేందుకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.
🏠 Home