🏠 prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 26 October 2026, 9:21 am Posted by : Praja Nestham Jwala News

చిల్లర చిచ్చు.. మహిళా కండక్టర్‌ను బస్సు నుంచి కిందకు నెట్టిన ప్రయాణికురాలు

News Image


బస్సు వెనుక టైర్ల కింద పడి కండక్టర్‌కు రెండు కాళ్లు విరుగు.. చిల్లర వివాదం తీవ్ర విషాదానికి దారితీరు

మణుగూరు, అక్టోబర్ 26 (ప్రజానేస్తం జ్వాల):
చిల్లర విషయంలో తలెత్తిన వివాదం ఓ మహిళా బస్సు కండక్టర్‌కు తీవ్ర గాయాలయ్యేలా చేసింది. చిల్లర వెంటనే ఇవ్వలేదన్న ఆగ్రహంతో ఓ ప్రయాణికురాలు మహిళా కండక్టర్‌ను బస్సు నుంచి కిందకు నెట్టివేసిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు వద్ద కలకలం రేపింది. ఈ ఘటనలో కండక్టర్ ప్రవళిక రెండు కాళ్లు విరిగినట్లు సమాచారం.

రూ.10 టికెట్.. రూ.100 నోటుతో మొదలైన వివాదం

వివరాల్లోకి వెళ్తే.. అశ్వాపురం మండలం మిట్టగూడెంకు చెందిన మౌనిక తన కుమారుడితో కలిసి మణుగూరు వద్ద భద్రాచలం వెళ్లే బస్సు ఎక్కింది. కుమారుడికి టికెట్ ఇవ్వాలని కండక్టర్ ప్రవళికకు రూ.100 నోటు ఇచ్చింది. టికెట్ ధర రూ.10 కావడంతో కండక్టర్ టికెట్ జారీ చేసి, మిగిలిన చిల్లరను టికెట్ వెనుక రాసి ఇచ్చినట్లు సమాచారం.
అయితే, తనకు చిల్లర వెంటనే ఇవ్వాలని మౌనిక పట్టుబట్టడంతో కండక్టర్‌తో వాగ్వాదం మొదలైంది. మాటామాటా పెరగడంతో ఆగ్రహానికి గురైన మౌనిక.. కండక్టర్ ప్రవళికను బస్సు నుంచి కిందకు నెట్టివేసినట్లు తెలిసింది.

వెనుక టైర్ల కింద పడి తీవ్ర గాయాలు

ఈ క్రమంలో ప్రవళిక బస్సు వెనుక టైర్ల కింద పడటంతో ఆమెకు రెండు కాళ్లు విరిగినట్లు సమాచారం. ఒక్కసారిగా చోటుచేసుకున్న ఈ ఘటనతో బస్సులోని ప్రయాణికులు, స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే స్పందించిన వారు గాయపడిన ప్రవళికను ఆసుపత్రికి తరలించారు.

నిందితురాలిపై కేసు నమోదు

ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు మౌనికను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిసింది. కేవలం చిల్లర విషయంలో తలెత్తిన వివాదం ఓ మహిళా ఉద్యోగి తీవ్రంగా గాయపడే పరిస్థితికి చేరడం చర్చనీయాంశంగా మారింది.
ప్రయాణికులు, సిబ్బంది మధ్య చిన్నపాటి వివాదాలు సహనంతో పరిష్కరించుకోవాల్సి ఉండగా.. ఆవేశపూరిత చర్యలు ఎంతటి ప్రమాదాలకు దారితీస్తాయో ఈ ఘటన మరోసారి హెచ్చరిస్తోంది.

🏠 Home