తొర్రూరులో ముందుగానే వైన్స్ మూసివేత.. బెల్టు షాపుల్లో అధిక ధరలు!
తొర్రూరు, అక్టోబర్ 20 (ప్రజానేస్తం జ్వాల): దసరా వేళ తొర్రూరులో మద్యం విక్రయాలపై అక్రమాల ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉండాల్సిన వైన్ షాపులను సాయంత్రం 6 గంటలకే మూసివేసి, బెల్టు షాపులకు మద్యం తరలిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. వైన్ షాపుల్లో రూ.180–190 ఉన్న బీరును బెల్టు షాపుల్లో రూ.230కు విక్రయిస్తున్నారని, ఇతర మద్యం బ్రాండ్లపై రూ.50 నుంచి రూ.70 వరకు అదనంగా వసూలు చేస్తున్నారని వాపోతున్నారు. కొన్ని బెల్టు షాపుల్లో కల్తీ మద్యం విక్రయిస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై ఎక్సైజ్ అధికారులు స్పందించి తనిఖీలు చేపట్టాలని, అధిక ధరల విక్రయాలు, అక్రమ మద్యం వ్యాపారాన్ని అరికట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.