జాతీయ స్థాయి చెస్ పోటీలకు వరంగల్ క్రీడాకారిణి లక్ష్మీ శార్వాణి ఎంపిక
హనుమకొండ, అక్టోబర్ 17 (ప్రజానేస్తం జ్వాల ప్రతినిధి మారెల్లి కిరణ్): ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన పుల్లూరు లక్ష్మీ శార్వాణి జాతీయ స్థాయి చెస్ పోటీలకు ఎంపికైంది. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌జీఎఫ్‌ఐ) ఆధ్వర్యంలో అక్టోబర్ 15న హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌లో నిర్వహించిన అండర్-19 రాష్ట్ర స్థాయి పోటీల్లో ఆమె ద్వితీయ స్థానం సాధించింది. ఈ విజయంతో ఈ నెల 23 నుంచి 28 వరకు ఢిల్లీలో జరగనున్న జాతీయ స్థాయి చెస్ టోర్నమెంట్‌లో తెలంగాణ తరఫున ప్రాతినిధ్యం వహించనుంది. జాతీయ పోటీలకు ఎంపికైన లక్ష్మీ శార్వాణిని అధ్యాపకులు, క్రీడా ప్రముఖులు అభినందించి, జాతీయ స్థాయిలోనూ ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు.