భద్రకాళి ఆలయంలో సరస్వతీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
హనుమకొండ, అక్టోబర్ 17 (ప్రజానేస్తం జ్వాల ప్రతినిధి మారెల్లి కిరణ్): శ్రీ భద్రకాళి దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఏడో రోజు శనివారం అమ్మవారు శ్రీ సరస్వతీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వీణాపాణిగా అలంకరించిన అమ్మవారిని దర్శించుకునేందుకు నగరంతోపాటు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించి మొక్కులు సమర్పించుకున్నారు. భక్తుల రాకతో ఆలయ పరిసరాల్లో సందడి నెలకొంది. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు, సిబ్బంది దర్శన ఏర్పాట్లను పర్యవేక్షించారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి వివిధ అలంకారాలను దర్శించుకునేందుకు భక్తులు ఆసక్తి చూపుతున్నారు.