వరకట్నం ఇవ్వడం, తీసుకోవడం నేరం: జిల్లా ప్రధాన న్యాయమూర్తి
హనుమకొండ, అక్టోబర్ 17 (ప్రజానేస్తం జ్వాల ప్రతినిధి మారెల్లి కిరణ్): వరకట్న దురాచార నిర్మూలన, బాలల హక్కుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి వి.బి. నిర్మలా గీతాంబ అన్నారు. శనివారం వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో రూపొందించిన అవగాహన పోస్టర్లను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వరకట్నం ఇవ్వడం, తీసుకోవడం చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు. వరకట్న వేధింపుల బాధితులకు న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఉచిత న్యాయ సహాయం అందిస్తామని తెలిపారు. బాలల హక్కులు, గోప్యతను కాపాడటంతోపాటు బాధితులకు పునరావాసం కల్పించడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. కార్యక్రమంలో న్యాయాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.