గ్రామపంచాయతీ సిబ్బందికి పండుగ కానుకగా నూతన వస్త్రాలు పంపిణీ చేసిన సర్పంచ్ బిల్లా యాదగిరి
వేలేరు, అక్టోబర్ 17 (ప్రజానేస్తం జ్వాల): గ్రామ పరిశుభ్రతే లక్ష్యంగా నిరంతరం శ్రమిస్తూ ప్రజలకు మెరుగైన పారిశుధ్య సేవలు అందిస్తున్న గ్రామపంచాయతీ సిబ్బంది సేవలను గుర్తించి, వారి పట్ల గౌరవాభిమానాలను చాటుకున్నారు వేలేరు మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ బిల్లా యాదగిరి. సద్దుల బతుకమ్మ, దసరా పండుగలను పురస్కరించుకుని గ్రామపంచాయతీకి చెందిన 18 మంది సిబ్బందికి నూతన వస్త్రాలను పంపిణీ చేసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ బిల్లా యాదగిరి మాట్లాడుతూ.. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో గ్రామపంచాయతీ సిబ్బంది చేస్తున్న కృషి, అందిస్తున్న సేవలు ఎంతో అభినందనీయమని పేర్కొన్నారు. ఎండ, వానలను సైతం లెక్కచేయకుండా గ్రామ పారిశుధ్యం కోసం నిరంతరం శ్రమిస్తున్న సిబ్బంది సేవలు వెలకట్టలేనివని అన్నారు. వారి కృషిని గుర్తిస్తూ సద్దుల బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా 18 మంది సిబ్బందికి నూతన వస్త్రాలను అందజేసినట్లు తెలిపారు. గ్రామ అభివృద్ధిలో పారిశుధ్య సిబ్బంది పాత్ర కీలకమని, వారి సేవలను ఎల్లప్పుడూ గౌరవించాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. పండుగలు ప్రతి ఒక్కరి జీవితాల్లో సంతోషం, సౌభాగ్యం నింపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ శ్రీకర్, గ్రామపంచాయతీ కార్యదర్శి విజయ, గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.