🏠 prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 16 October 2026, 11:17 pm Posted by : Praja Nestham Jwala News

పెండింగ్ కేసుల పరిష్కారంలో జాప్యం వద్దు.. నేరస్తులకు శిక్ష పడేలా దర్యాప్తు చేయాలి!

News Image
ఆసిఫాబాద్, అక్టోబర్ 16 (ప్రజానేస్తం జ్వాల ప్రతినిధి మాడావి మనోహర్): పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించి బాధితులకు న్యాయం అందించాలని కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ నితికా పంత్, ఐపీఎస్, పోలీస్ అధికారులను ఆదేశించారు. ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు చేపట్టి, నేరస్తులకు చట్టప్రకారం శిక్ష పడేలా ఆధారాలను పకడ్బందీగా సేకరించాలని సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన నెలవారీ నేర సమీక్షా సమావేశంలో ఎస్పీ పోలీస్ అధికారులతో కేసుల పురోగతి, నేర నియంత్రణ చర్యలు, శాంతిభద్రతల పరిరక్షణపై సమీక్షించారు. కేసుల విచారణలో అనవసర జాప్యం చేయకుండా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. దసరా, బతుకమ్మ పండుగలతో పాటు దుర్గామాత ఉత్సవాల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ ఆదేశించారు. ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిర్వహించేలా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రజలకు భద్రతపై భరోసా కల్పిస్తూ నిరంతరం నిఘా కొనసాగించాలని తెలిపారు. పెట్రోలింగ్, బ్లూకోల్ట్స్ వాహనాల ద్వారా అధికారులు, సిబ్బంది నిరంతరం గస్తీ నిర్వహిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని ఎస్పీ సూచించారు. డయల్ 112కు వచ్చే అత్యవసర కాల్స్‌పై వేగంగా స్పందించి బాధితులకు సత్వర సహాయం అందించాలన్నారు. ప్రతి పోలీస్‌స్టేషన్ పరిధిలో నాకాబంది, కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలతో సమన్వయం పెంపొందించుకోవాలని తెలిపారు.

బెట్టింగ్, జూదం, మట్కా, గంజాయి వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై నిఘా పెంచి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించారు. మద్యం సేవించి వాహనాలు నడిపేవారు, ర్యాష్ డ్రైవింగ్‌తో ప్రమాదాలకు కారణమయ్యే వారిని గుర్తించేందుకు నిరంతరం వాహన తనిఖీలు చేపట్టాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. మహిళలు, చిన్నారులపై జరిగే నేరాలు, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల అక్రమ కార్యకలాపాలు, తీవ్రమైన నేరాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ తెలిపారు. నేరాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టి ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ప్రజలు, వ్యాపారులు తమ ఇళ్లు, వ్యాపార సముదాయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో ఆసిఫాబాద్ డీఎస్పీ అశోక్, కాగజ్‌నగర్ డీఎస్పీ వాహీదుద్దీన్, పోలీస్ ఇన్‌స్పెక్టర్లు, సబ్‌ఇన్‌స్పెక్టర్లు, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
🏠 Home