క్రీడలే యువతకు బలం.. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి!
భీమదేవరపల్లి, అక్టోబర్ 16 (ప్రజానేస్తం జ్వాల ప్రతినిధి రజినికాంత్): యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని, క్రీడా రంగంలో రాణించి ఉన్నత స్థాయికి ఎదగాలని నాయకులు పిలుపునిచ్చారు. క్రీడలు యువతలో క్రమశిక్షణ, ఐక్యత, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలికి దోహదపడతాయని పేర్కొన్నారు. భీమదేవరపల్లి మండలం కొత్తకొండ గ్రామంలో నార్కోటిక్స్ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన కబడ్డీ పోటీల కార్యక్రమంలో డీఎస్పీ, సీఐ, ఎస్‌ఐ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోటీల్లో విజయం సాధించిన క్రీడాకారులను అభినందించి, విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా క్రీడల వైపు మళ్లాలని సూచించారు. క్రీడల్లో పాల్గొనడం ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసిక వికాసం సాధ్యమవుతుందని తెలిపారు. మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన పెంచుకుని, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో యువత భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో భీమదేవరపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పోచంపల్లి రాజిరెడ్డి, కొత్తకొండ కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు సిద్ధమల్ల వెంకటేష్, ఊస కోయిల ప్రకాష్, పిడిశెట్టి కనకయ్య, మంగ రామచంద్రం, గోపగోని తిరుపతి, పూదరి రవీందర్, చింతరాజు, యాటపోలు శ్రీనివాస్, ఉపసర్పంచ్, ఫోరం అధ్యక్షుడు తాళ్లపెల్లి అరవింద్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.