నీటి వృథాకు చెక్.. ప్రతి బొట్టూ భవిష్యత్తుకు భరోసా!
సూర్యపేట జిల్లా ,నేరేడుచర్ల (ప్రజానేస్తం జ్వాల ): భూగర్భ జలాలు అడుగంటుతున్న నేపథ్యంలో ప్రతి నీటి బొట్టును పొదుపుగా వినియోగించాలని నేరేడుచర్ల మున్సిపల్ కమిషనర్ చెన్నబోయిన నాగరాజు పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గి, ఎండల తీవ్రత పెరగడంతో భూగర్భ జలాలపై తీవ్ర ప్రభావం పడుతోందని తెలిపారు. మిషన్ భగీరథ ద్వారా సరఫరా అవుతున్న తాగునీటిని అవసరమైన మేరకే వినియోగించాలని సూచించారు.ప్రతి ఇంటి నల్లాకు తప్పనిసరిగా ట్యాపులు ఏర్పాటు చేసుకుని నీరు వృథాగా రోడ్లపైకి, కాలువల్లోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఇష్టానుసారంగా నీటిని వృథా చేస్తే రాబోయే రోజుల్లో మున్సిపాలిటీ తరఫున కఠిన ఆంక్షలు, చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.మున్సిపల్ పరిధిలోని ప్రతి ఇంటి వద్ద వర్షపు నీటి ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. నీటి సంరక్షణలో ప్రజలందరూ మున్సిపల్ యంత్రాంగానికి సహకరించాలని కోరారు.నీటిని కాపాడుకుందాం.. భావితరాలకు భరోసా ఇద్దాం. నేరేడుచర్ల ప్రజల సంక్షేమమే మున్సిపాలిటీ ఏకైక లక్ష్యం అని కమిషనర్ చెన్నబోయిన నాగరాజు పేర్కొన్నారు.